నిర్గమకాండము 34
34
1మరియు యెహోవా మోషేతో–మొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను. 2ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరముమీద నా సన్నిధిని నిలిచియుండవలెను. 3ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండమీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. 4కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా 5మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 6అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా 7ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను. 8అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి 9–ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మామధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొను మనెను 10అందుకు ఆయన–ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏజనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు. నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది. 11నేడు నేను నీ కాజ్ఞా పించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీ యులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను. 12నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును. 13కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను. 14ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు. 15ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినయెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము. 16మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. 17పోతపోసిన దేవతలను చేసికొన వలదు. 18మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి. 19ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయేగాని గొఱ్ఱెపిల్లయేగాని అది నాదగును 20గొఱ్ఱెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు వట్టిచేతులతో కనబడవలదు. 21ఆరు దినములు నీవు పనిచేసి యేడవదినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. 22మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను. 23సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను 24ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశిం పడు. 25నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు. 26నీ భూమియొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను. 27మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను. 28అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.
29మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములుగల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు. 30అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. 31మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాటలాడెను. 32అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికాజ్ఞాపించెను. 33మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖముమీద ముసుకు వేసికొనెను. 34అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడినదానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. 35మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమకాండము 34: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.