నిర్గమకాండము 29

29
1వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా 2ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసికొనుము. 3గోధుమపిండితో వాటినిచేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను. 4మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి 5ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువు టంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి 6అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి 7అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను. 8మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. 9అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను. 10మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా 11ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. 12ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలి పీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను. 13మరియు ఆంత్రములను కప్పు కొను క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను. 14ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి. 15నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా 16నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను. 17అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి 18బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. 19మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా 20ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను, వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను. 21మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రములమీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితము లగును. 22మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను 23ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని 24అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. 25తరువాత నీవు వారి చేతులలోనుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. 26మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును. 27ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. 28అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహరోనుకును అతని కుమారులకునగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠా ర్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును. 29మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. 30అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.
31మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను. 32అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంప లోని రొట్టెలను తినవలెను. 33వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. 34ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండినయెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. 35నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. 36ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 37ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.
38నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱెపిల్లను 39సాయంకాలమందు ఒక గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను. 40దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను. 41అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను. 42ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును. 43అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును. 44నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. 45నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించి వారికి దేవుడనై యుందును. 46కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 29: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

నిర్గమకాండము 29 కోసం వీడియో