నిర్గమకాండము 23:14-33

నిర్గమకాండము 23:14-33 TELUBSI

సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియనిరొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంటయొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయమువరకు నిలువ యుండకూడదు. నీ భూమి ప్రథమఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తిచేసెదను. నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశములవారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను. మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టును. దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను. నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను. మరియు ఎఱ్ఱసముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రమువరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొన వద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లువారు నీ దేశములో నివసింపకూడదు.

నిర్గమకాండము 23:14-33 కోసం వీడియో