తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ఛక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియసహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును. మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
చదువండి ఎఫెసీయులకు 6
వినండి ఎఫెసీయులకు 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఎఫెసీయులకు 6:10-23
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు