ద్వితీయోపదేశకాండము 24

24
1ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను. 2ఆమె అతని యింటనుండి వెళ్లినతరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును. 3ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడలనేమి 4ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు.
5ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను.
6తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే.
7ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.
8కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి. 9మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి.
10నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు 11నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును. 12ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను. 13అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
14నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను. 15సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను.వాడు బీదవాడు గనుక దానిమీద ఆశపెట్టుకొనియుండును.వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.
16కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును.
17పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు. 18నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించె నని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
19నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవుచేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.
20నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. 21నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను. 22నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటి వని జ్ఞాపకముచేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 24: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 24