ద్వితీయోపదేశకాండము 18

18
1యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయులకందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు. 2వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవావారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన 3యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను. 4నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను. 5నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు.
6ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు 7అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను. 8అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను.
9నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. 10తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను 11కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. 12వీటినిచేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు. 13నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను. 14నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు. 15హోరేబులో ఆ సమాజదినమున నీవు–నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, 16ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. 17మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; 18వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. 19అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణచేసెదను. 20అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితరదేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. 21మరియు –ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనినయెడల, 22ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయినయెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 18: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 18