ద్వితీయోపదేశకాండము 18:1-14

ద్వితీయోపదేశకాండము 18:1-14 TELUBSI

యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయులకందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవావారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటినిచేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.