ద్వితీయోపదేశకాండము 15:4-15

ద్వితీయోపదేశకాండము 15:4-15 TELUBSI

నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడేగాని హెబ్రీయురాలేగాని నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను.