ఆమోసు 4
4
1షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా –మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా 2–ఒక కాలమువచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలములచేతను పట్టుకొని లాగుదురు. 3ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.
4బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినముల కొక సారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. 5పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి,#4:5 దహించుడి. స్వేచ్ఛార్పణనుగూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 6మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారములేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. 7మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురి పించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను. 8రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. 9మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. 10మరియు నేను ఐగుప్తీయులమీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. 11దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు. 12కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. 13పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆమోసు 4: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.