అపొస్తలుల కార్యములు 9:21-43

అపొస్తలుల కార్యములు 9:21-43 TELUBSI

వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పెట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు–ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను. ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొనివచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.

అపొస్తలుల కార్యములు 9:21-43 కోసం వీడియో