అపొస్తలుల కార్యములు 9:20-31

అపొస్తలుల కార్యములు 9:20-31 TELUBSI

వెంటనే సమాజమందిరములలో –యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.

అపొస్తలుల కార్యములు 9:20-31 కోసం వీడియో