అపొస్తలుల కార్యములు 23:1-10

అపొస్తలుల కార్యములు 23:1-10 TELUBSI

పౌలు మహా సభవారిని తేరిచూచి–సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధానయాజకుడైన అననీయ–అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి–సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు –నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి. అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు– నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను. వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి–సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమునుగూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు. అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి–ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి–మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.

అపొస్తలుల కార్యములు 23:1-10 కోసం వీడియో