అపొస్తలుల కార్యములు 21:27-40

అపొస్తలుల కార్యములు 21:27-40 TELUBSI

ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహ మంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని –ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజ లకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందువారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను; వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞా పించి–ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా, సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయు చున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను. ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచి–నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు–గ్రీకుభాష నీకు తెలియునా? ఈ దినములకుమునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను. అందుకు పౌలు–నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను

అపొస్తలుల కార్యములు 21:27-40 కోసం వీడియో