అపొస్తలుల కార్యములు 18:1-17

అపొస్తలుల కార్యములు 18:1-17 TELUBSI

అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను. యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని–మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను. ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు–నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి –వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను – యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే. ఇది యేదో యొక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమునుగూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శచేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను. అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.

అపొస్తలుల కార్యములు 18:1-17 కోసం వీడియో