అపొస్తలుల కార్యములు 18:1-17
అపొస్తలుల కార్యములు 18:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను. యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని–మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను. ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు–నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి –వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను – యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే. ఇది యేదో యొక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమునుగూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శచేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను. అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.
అపొస్తలుల కార్యములు 18:1-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు. అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ మేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు. పౌలు కూడా వారిలా డేరాలను తయారు చేసేవాడు, కనుక అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు. అతడు యూదులను మరియు గ్రీసుదేశస్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తూ, ప్రతి సబ్బాతు దినాన సమాజమందిరంలో తర్కించేవాడు. సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు. అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరిగినప్పుడు, అతడు తన బట్టలను దులుపుకొని, “ ‘మీ రక్తం మీ తలల మీదికే వచ్చు గాక!’ నేనైతే ఈ విషయంలో నిర్దోషిని. ఇక ఇప్పటి నుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాను” అని వారితో చెప్పాడు. పౌలు సమాజమందిరం నుండి బయటకు వెళ్లి దాని ప్రక్కనే ఆనుకొని ఉన్న దేవుని ఆరాధించే తీతియు యూస్తు అనే వాని ఇంటికి వచ్చాడు. ఆ సమాజమందిరపు నాయకుడైన క్రిస్పు మరియు అతని కుటుంబమంతా ప్రభువును నమ్ముకున్నారు; అలాగే పౌలు మాటలు విన్న చాలామంది కొరింథీయులు నమ్మి బాప్తిస్మం పొందుకొన్నారు. ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, “భయపడకు; భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు” అని చెప్పారు. కనుక ఒకటిన్నర సంవత్సరం పాటు పౌలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు. అకయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకొని వచ్చారు. వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు. పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీమాటలు వినడం న్యాయంగా ఉంటుంది. కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కనుక మీరే పరిష్కరించుకొండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి, వారందరిని అక్కడి నుండి పంపేశాడు. అప్పుడు ఆ ప్రజలందరు సమాజమందిరపు అధికారి సోస్తెనేసును పట్టుకొని న్యాయస్థానం ముందు కొట్టారు, అయినా కానీ గల్లియో దాని గురించి ఏమి పట్టించుకోలేదు.
అపొస్తలుల కార్యములు 18:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు. పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ కనుగొన్నాడు. యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి కొద్ది కాలం క్రితమే ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు. వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు. అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు. సీల, తిమోతిలు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్కు బోధించడంలో మరింతగా నిమగ్నమయ్యాడు. అతనిలో ఆత్మ కలిగించే ఆసక్తివల్ల యేసే క్రీస్తని యూదులకు బలంగా సాక్షమిస్తున్నాడు. ఆ యూదులు అతనిని ఎదిరించి దూషించారు. అతడు తన బట్టలు దులుపుకుని, “మీ రక్తం మీ తలమీదే ఉండుగాక. నేను నిర్దోషిని. ఇక నుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాను” అని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకుని ఉంది. ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు. ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు” అని పౌలుతో చెప్పాడు. అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు. గల్లియో అకయకు గవర్నరుగా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసుకుని వచ్చారు. “వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు” అని ఆరోపణ చేశారు. పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, “యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే. ఇది ఏదో ఉపదేశం గురించో, పేరుల గురించో, మీ ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు” అని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపివేశాడు. అప్పుడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.
అపొస్తలుల కార్యములు 18:1-17 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు. అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోమా నగరం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీనుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు. తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు. ప్రతి విశ్రాంతి రోజూ సమాజమందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. మాసిదోనియనుండి సీల, తిమోతి వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు. కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు. పౌలు సమాజమందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు. యూదుల సమాజమందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి అతని యింట్లోనివాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు. ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు. పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవసందేశాన్ని వాళ్ళకు బోధించాడు. గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి, “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు. పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది. కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి. అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానంనుండి తరిమివేసాడు. వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు ఊరుకొన్నాడు.
అపొస్తలుల కార్యములు 18:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు. అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞమేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు. పౌలు కూడా వారిలా డేరాలను తయారుచేసేవాడు, కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు. అతడు యూదులను గ్రీసుదేశస్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తూ, ప్రతి సబ్బాతు దినాన సమాజమందిరంలో తర్కించేవాడు. సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు. అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరిగినప్పుడు, అతడు తన వస్త్రాలను దులుపుకొని, “ ‘మీ రక్తం మీ తలల మీదికే వచ్చు గాక!’ నేనైతే ఈ విషయంలో నిర్దోషిని. ఇక ఇప్పటినుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాను” అని వారితో చెప్పాడు. పౌలు సమాజమందిరం నుండి బయటకు వెళ్లి దాని ప్రక్కనే ఆనుకుని ఉన్న దేవుని ఆరాధించే తీతియు యూస్తు అనే వాని ఇంటికి వచ్చాడు. ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు అతని కుటుంబమంతా ప్రభువును నమ్ముకున్నారు; అలాగే పౌలు మాటలు విన్న చాలామంది కొరింథీయులు నమ్మి బాప్తిస్మం పొందుకున్నారు. ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, “భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు” అని చెప్పారు. కాబట్టి ఒకటిన్నర సంవత్సరం పాటు పౌలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు. అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు. వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు. పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీ మాటలు వినడం న్యాయంగా ఉంటుంది. కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కాబట్టి మీరే పరిష్కరించుకోండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి, వారందరిని అక్కడినుండి పంపేశాడు. అప్పుడు ఆ ప్రజలందరు సమాజమందిరపు అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయస్థానం ముందు కొట్టారు, అయినా కానీ గల్లియో దాని గురించి ఏమి పట్టించుకోలేదు.