అపొస్తలుల కార్యములు 13:44-52

అపొస్తలుల కార్యములు 13:44-52 TELUBSI

మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి–దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము; ఏలయనగా –నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.

అపొస్తలుల కార్యములు 13:44-52 కోసం వీడియో