అపొస్తలుల కార్యములు 13:44-52

అపొస్తలుల కార్యములు 13:44-52 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి–దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము; ఏలయనగా –నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.

అపొస్తలుల కార్యములు 13:44-52 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు. యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు. అయితే పౌలు మరియు బర్నబాలు ధైర్యంగా వారికి సమాధానం ఇచ్చారు: “మేము దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాలి. కానీ మీరు దానిని తిరస్కరించి నిత్యజీవానికి అర్హులుగా ఎంచుకోలేదు, కాబట్టి మేము యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాం. ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే: “మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా, నేను మిమ్మల్ని యూదేతరులందరికి వెలుగుగా నియమించాను.” అప్పుడు యూదేతరులు ఈ మాటలు విని సంతోషించి ప్రభువు వాక్యాన్ని గౌరవించారు. మరియు నిత్యజీవం కొరకు నియమించబడిన వారందరు నమ్మారు. ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది. కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను మరియు ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు. కనుక వారు తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడ నుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతపు శిష్యులు పరిశుద్ధాత్మతో ఆనందంతో నింపబడ్డారు.

అపొస్తలుల కార్యములు 13:44-52 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్కు వినడానికి సమావేశం అయింది. యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి వారిని హేళన చేశారు. అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు, “దేవుని వాక్కు మొదట మీకు చెప్పడం అవసరమే. అయినా మీరు దాన్ని తోసివేసి, మీకు మీరే నిత్యజీవానికి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము యూదేతరుల దగ్గరికి వెళ్తున్నాం. “ఎందుకంటే, ‘నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చేవానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను’ అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు” అన్నారు. యూదేతరులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్కును కొనియాడారు. అంతేగాక నిత్యజీవానికి నియమితులైన వారంతా విశ్వసించారు. ప్రభువు వాక్కు ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. అయితే యూదులు భక్తి మర్యాదలున్న స్త్రీలనూ ఆ పట్టణ ప్రముఖులనూ రెచ్చగొట్టి పౌలునూ బర్నబానూ హింసల పాలు చేసి, వారిని తమ ప్రాంతం నుండి తరిమేశారు. అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు. అయితే శిష్యులు ఆనందంతో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 13:44-52 పవిత్ర బైబిల్ (TERV)

మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది. సమావేశమయిన ప్రజల్ని చూసి యూదుల్లో అసూయ నిండిపోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి అతణ్ణి దూషించారు. పౌలు, బర్నబా ధైర్యంగా సమాధానం చెబుతూ, “అందరికన్నా ముందు దైవసందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కాని మీరు నిరాకరించటంవల్ల, నిత్యజీవానికి అనర్హులమని మీలో మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి యితరుల దగ్గరకు వెళ్తున్నాము. ప్రభువు యిలా ఆజ్ఞాపించాడు అని అన్నాడు: ‘ప్రపంచానికి రక్షణ కలిగించాలని యితర దేశాలకు నిన్నొక వెలుగుగా చేసాను!’” యూదులు కానివాళ్ళు ఇది విని ఆనందించారు. ప్రభువు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసులయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి దేవుడు వీళ్ళను ఎన్నుకొన్నాడు. దైవసందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవభక్తి గల గొప్పింటి స్త్రీలతో మాట్లాడి వాళ్ళకు పౌలుపట్ల, బర్నబాపట్ల కోపం కలిగేటట్లు చేసారు. అంతా కలిసి వాళ్ళను హింసించి ఆ తదుపరి వాళ్ళను తమ పట్టణంనుండి తరిమివేసారు. పౌలు, బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి “ఈకొనియ” అనే పట్టణానికి వెళ్ళిపోయారు. కాని విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండటంవల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు.

అపొస్తలుల కార్యములు 13:44-52 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు. యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు. అయితే పౌలు బర్నబాలు ధైర్యంగా వారికి సమాధానం ఇచ్చారు: “మేము దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాలి. కానీ మీరు దానిని తిరస్కరించి నిత్యజీవానికి అర్హులుగా ఎంచుకోలేదు, కాబట్టి మేము యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాము. ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే: “మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా, నేను మిమ్మల్ని యూదేతరులకు వెలుగుగా నియమించాను.” అప్పుడు యూదేతరులు ఈ మాటలు విని సంతోషించి ప్రభువు వాక్యాన్ని గౌరవించారు. నిత్యజీవం కోసం నియమించబడిన వారందరు నమ్మారు. ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది. కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు. కాబట్టి వారు హెచ్చరికగా తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడినుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతపు శిష్యులు పరిశుద్ధాత్మతో ఆనందంతో నింపబడ్డారు.