2 రాజులు 7

7
1అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను–యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా– రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును. 2అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు– నీవు కన్నులార దానిని చూచెదవుగాని దానిని తినకుందు వని అతనితో చెప్పెను.
3అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచి–మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? 4పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనులదండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని 5సందెచీకటియందు సిరియనులదండు పేటలోనికి పోవలెనని లేచి, సిరియనులదండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి. 6యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులదండునకు వినబడునట్లుచేయగా వారు–మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలురాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని 7లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి. 8కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చటనుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెట్టిరి. 9వారు–మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చటనుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని 10వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి–మేము సిరియనులదండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైననులేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా 11వాడు ద్వారపాల కుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా 12రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి–సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక–వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను. 13అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవిచేసెను–ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదు గురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. 14వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా–సిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. 15కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా 16జనులు బయలుదేరి సిరియనులదండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాటచొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను. 17ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను. 18మరియు–రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. 19ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు–నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను. 20జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 7: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి