2 రాజులు 23

23
1అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి 2యూదావారినందరిని యెరూషలేము కాపు రస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను. 3రాజు ఒక స్తంభముదగ్గర నిలిచి– యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధనచేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి. 4రాజు–బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటిని యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను. 5మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను. 6యెహోవామందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను. 7మరియు యెహోవామందిరమందున్న పురుషగాములయిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. 8యూదా పట్టణములలోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్రపరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను. 9అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. 10మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‍హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. 11ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను. 12మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. 13యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొమోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి 14ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. 15బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాముకట్టించిన ఆ ఉన్నతస్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నతస్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. 16యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను. 17అంతట అతడు–నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు–అది యూదాదేశము నుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి. 18అందుకతడు–దానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. 19మరియు ఇశ్రాయేలురాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. 20అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠములమీద చంపించి వాటిమీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
21అంతట రాజు–నిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా 22ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలురాజులయొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటివరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను. 23ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. 24మరియు కర్ణపిశాచిగలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. 25అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు. 26అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను. 27కాబట్టి యెహోవా – నేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను. 28యోషీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 29అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. 30అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
31యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తెయగు హమూటలు. 32ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను. 33ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి 34యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజును ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను. 35యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను.
36యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. 37ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 23: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి