2 రాజులు 15
15
1ఇశ్రాయేలురాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజర్యా యేలనారంభించెను. 2అతడు పదునారేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా. 3ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను. 4ఉన్నతస్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నతస్థలములయందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి. 5యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. 6అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 7అజర్యా తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను.
8యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పది యెనిమిదవ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఆరునెలలు ఏలెను. 9ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరి గించెను. 10యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీదపడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను. 11జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 12–నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులైయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.
13యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు ఏలెను. 14గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీదపడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను. 15షల్లూము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది. 16మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను.
17యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మిదవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను. 18ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 19అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండువేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. 20మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశమును విడిచి వెళ్లిపోయెను. 21మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 22మెనహేము తన పితరులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.
23యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను. 24ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 25ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబదిమందితోను, అర్గోబుతోను, అరీహేతోను కలిసికొని షోమ్రోనులో నున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను. 26పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
27యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సరములు ఏలెను. 28ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 29ఇశ్రాయేలురాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను. 30అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీదపడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. 31పెకహు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.
32ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. 33అతడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా. 34ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. 35అయినను ఉన్నతస్థలములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నతస్థలములందు ఇంకను బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వారమును కట్టించెను. 36యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 37ఆ దినములో యెహోవా సిరియారాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశముమీదికి పంపనారంభించెను. 38యోతాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 15: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.