2 రాజులు 13

13
1యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను. 2ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 3కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారి కప్పగించెను. 4అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను. 5కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొనిమునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి. 6అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను. 7రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను. 8యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 9యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.
10యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారం భించి పదునారుసంవత్సరములు ఏలెను. 11ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటి ననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 12యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 13యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను.
14అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను. 15అందుకు ఎలీషా–నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను. 16–నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలురాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి 17–తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా –బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు–ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతముచేయుదు వని చెప్పి, 18బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతో–నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. 19అందునిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి–నీవు అయిదుమారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
20తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు 21కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
22యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను. 23గాని యెహోవావారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను. 24సిరియారాజైన హజాయేలు మరణముకాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. 25అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 రాజులు 13