2 దినవృత్తాంతములు 33
33
1మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను. 2ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను. 3ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. 4మరియు–నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవామందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. 5మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. 6బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యముచేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను. 7-8–ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను, నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనుటకై వారు జాగ్రత్తపడినయెడల, మీపితరులకు నేను ఖాయపరచిన దేశమునుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. 9ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చిన వాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.
10యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. 11కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి. 12అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని 13ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.
14ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మమువరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను. 15మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవామందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. 16ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధానబలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను. 17అయినను జనులు ఉన్నతస్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. 18మనష్షే చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలనుగూర్చియు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. 19అతడు చేసిన ప్రార్థననుగూర్చియు, అతని మనవి వినబడుటనుగూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణపడకముందు ఉన్నతస్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను అచ్చట నిలుపుటనుగూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది. 20మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.
21ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను. 22అతడు తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు 23తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను. 24అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా 25దేశ జనులు ఆమోను రాజుమీద కుట్రచేసిన వారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 33: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.