2 దినవృత్తాంతములు 2:1-6

2 దినవృత్తాంతములు 2:1-6 TELUBSI

సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని ఏర్పరచుకొని వీరిమీద మూడువేల ఆరువందలమందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.