2 దినవృత్తాంతములు 16
16
1ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలురాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా 2ఆసా యెహోవామందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి 3–నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను; ఇశ్రాయేలురాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను. 4బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. 5బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. 6అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించు చుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసికొని వచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను.
7ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను–నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను. 8బహువిస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతికప్పగించెను. 9తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. 10ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రముచూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. 11ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. 12ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను. 13ఆసా తన పితరులతోకూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా 14అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహువిస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 16: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.