1 సమూయేలు 3

3
1బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు. 2ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను 3దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను 4యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి 5ఏలీదగ్గరకు పోయి–నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు–నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. 6యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. 7సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు. 8యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి 9–నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 10తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా–సమూయేలూ సమూయేలూ, అనిపిలువగా సమూయేలు–నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. 11అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును. 12ఆ దినమున ఏలీయొక్క యింటివారినిగురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. 13తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. 14కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. 15తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను. 16అయితే ఏలీ–సమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు– చిత్తము నేనిక్కడ ఉన్నాననెను. 17ఏలీ–నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా 18సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని–సెలవిచ్చినవాడు యెహోవా; తన దృిష్టికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను. 19సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. 20కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి 21మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 3: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 1 సమూయేలు 3