1 సమూయేలు 17:31-58

1 సమూయేలు 17:31-58 TELUBSI

దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. –ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తములేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు–ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను–మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు–ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గ రకువచ్చి చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. –నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందునవాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచి–జయము జయమని అరచుచు లోయవరకును షరాయిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి–అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు–రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను. అందుకు రాజు–ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను. సౌలు అతనిని చూచి–చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు–నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.