1 సమూయేలు 12
12
1అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–ఆలకించుడి; మీరు నాతో చెప్పినమాట నంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించియున్నాను. 2రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు, మీ మధ్యనున్నారు; బాల్యమునాటినుండి నేటివరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని. 3ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను. 4–నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా 5అతడు–అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడు–సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. 6మరియు సమూయేలు జనులతో ఇట్లనెను–మోషేను అహరోనును నిర్ణయించి మీపితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా 7కాబట్టి యెహోవా మీకును మీపితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి. 8యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీపితరులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందునవారు మీపితరులను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింప జేసిరి. 9అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరుయొక్క సేనాధిపతియైన సీసెరా చేతికిని ఫిలిష్తీయుల చేతికిని మోయాబు రాజుచేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. 10అంతట వారు–మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్తారోతు దేవతలను పూజించి నందున పాపము చేసితిమి; మా శత్రువుల చేతిలోనుండి నీవు మమ్మును విడిపించినయెడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొఱ్ఱపెట్టగా 11యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. 12అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను–ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. 13కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించియున్నాడు. 14మీరు యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును. 15అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీపితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. 16మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. 17గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. 18సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి 19సమూయేలుతో ఇట్లనిరి–రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. 20అంతట సమూయేలు జనులతో ఇట్లనెను– భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. 21ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే. 22యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. 23నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును. 24ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 25మీరు కీడుచేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 12: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.