1 రాజులు 7
7
1సొలొమోను పదమూడు సంవత్సరములు తన నగ రును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. 2మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభములమీద దేవదారు దూలములు వేయబడెను. 3మరియు నలువదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను. 4మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను. 5తలుపులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను. 6మరియు అతడు స్తంభములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటపమును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను. 7తరువాత తాను తీర్పుతీర్చ కూర్చుండుటకై యొక అధికార మంటపమును కట్టించెను; దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కఱ్ఱతో కప్పబడెను. 8లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపమువంటి యొక నగరును కట్టించెను. 9ఈ కట్టడములన్నియు పునాది మొదలుకొని గోడ చూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణప్రకారముగా తొలవబడినట్టివియు, రంపములచేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను; ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను. 10దాని పునాది పదేసి యెనిమిదేసి మూరలుగల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. 11పైతట్టున పరిమాణప్రకారముగా చెక్క బడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు. 12గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.
13రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను. 14ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితోచేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. 15ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది. 16మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు. 17మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను. 18ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను. 19మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను. 20మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను. 21ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను. 22ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను. 23మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈతట్టు పై అంచు మొదలుకొని ఆతట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్రముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు. 24దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోతపోయబడెను. 25అది పండ్రెండు ఎడ్లమీద నిలువబడియుండెను; వీటిలో మూడు ఉత్తరదిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణదిక్కును మూడు తూర్పుదిక్కును చూచుచుండెను. వీటిమీద ఆ సముద్రము ఎత్తబడి యుండెను. వాటి వెనుకటి భాగములన్నియు లోపలితట్టు త్రిప్పబడి యుండెను. 26అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్పములవంటి పని కలిగి యుండెను; అది తొమ్మిది గరిసెలు పట్టును. 27మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను. 28ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను. 29జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను. 30మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి యిత్తడి చక్రములు ఇత్తడి యిరుసులును కలిగి యుండెను; దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు; ఈ దిమ్మలు తొట్టిక్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. 31మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడు నిడివి; అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూర న్నర నిడివి. మరియు ఆ మూతిమీద ప్రక్కలుగల చెక్కిన పనులు గలవు; ఇవి గుండ్రనివిగాక చచ్చౌకముగా ఉండెను. 32మరియు ప్రక్కపలకల క్రింద నాలుగు చక్రములు కలవు; చక్రముల యిరుసులు స్తంభములతో అతకబడి యుండెను; ఒక్కొక్క చక్రము మూరెడునర నిడివి గలదై యుండెను. 33ఈ చక్రముల పని రథచక్రముల పనివలె ఉండెను, వాటి యిరుసులును అడ్డలును పూటీలును ఆకులును పోతపనివై యుండెను. 34ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు; ఈ దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను. 35మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి యుండెను; మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏకాండముగా ఉండెను. 36దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పల కలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటునుబట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను. 37ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను. 38తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. 39మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను; సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను. 40మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను. 41రెండు స్తంభములను, ఆ రెండు స్తంభములమీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పై పీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను, 42ఆ స్తంభములమీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లికయొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను, 43పది స్తంభములను, స్తంభములమీద పది తొట్లను, 44ఒక సముద్రమును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను, 45బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను. 46యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోతపోయించెను. 47అయితే ఈ ఉపకరణములు అతివిస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను; ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను. 48మరియు సొలొమోను యెహోవామందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను, 49గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయిదును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను, 50మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరిశుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటిని చేయించెను, ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్త మాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 7: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.