1 రాజులు 15
15
1నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలు బడిలో పదునెనిమిదవ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను. 2అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె. 3అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్ని టిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. 4దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక 5దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను. 6రెహబాము#15:6 కొన్ని ప్రాచీన ప్రతులలో–అబీయాము అని పాఠాంతరము. బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. 7అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను. 8అబీయాము తన పితరులతోకూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
9ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను. 10అతడు నలువదియొక సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వపేరు#15:10 తల్లి. మయకా, యీమె అబీషాలోము కుమార్తె. 11ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని 12పురుషగాములను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడ గొట్టెను. 13మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను. 14ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెనుగాని ఉన్నతస్థలములను తీసివేయకపోయెను. 15మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. 16వారు బ్రది కిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలురాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను. 17ఇశ్రాయేలురాజైన బయెషా యూదావారికి విరోధియైయుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టించెను. 18కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా 19–నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి యుండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రాయేలురాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. 20కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణములమీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపట్టెను. 21అది బయెషాకు వర్తమానముకాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. 22అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటనచేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటిచేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. 23ఆసా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను. 24అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.
25యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సరములు ఏలెను. 26అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. 27ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారం దరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను. 28రాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను. 29తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవునిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. 30తాను చేసిన పాపములచేత ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. 31నాదాబు చేసిన ఇతర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 32వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలురాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను.
33యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను. 34ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 15: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.