1 రాజులు 11
11
1మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి 2కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. 3అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందలమంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను. 5సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. 6ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు. 7సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను. 8తమ దేవతలకు ధూపము వేయుచు బలులనర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
9ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై 10–నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి 11–సెలవిచ్చినదేమనగా – నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. 12అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను. 13రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.
14యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. 15దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను. 16ఎదోములోనున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితోకూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను. 17అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను. 18వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. 19హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను. 20ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికిగెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుకగెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. 21అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని–నేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా 22ఫరో–నీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయొద్ద నీకేమి తక్కు వైనది అని యడిగెను. అందుకు హదదు–తక్కువైన దేదియు లేదుగాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.
23మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు. 24దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్యమునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను. 25హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.
26మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. 27ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను. 28అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను. 29అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను. 30అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తున కలుగా చింపి యరొబాముతో ఇట్లనెను–ఈ పది తునకలను నీవు తీసికొనుము; 31-33ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. 34రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును. 35అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను; 36నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. 37నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు. 38నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను. 39వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదు సంతతివారిని బాధ పరచుదునుగాని నిత్యము బాధింపను. 40జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెను.
41సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమునుగూర్చియు, సొలొమోను కార్యములనుగూర్చిన గ్రంథమందు వ్రాయబడి యున్నది. 42సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు. 43అంతట సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 11: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.