1 కొరింథీయులకు 15:50-58

1 కొరింథీయులకు 15:50-58 TELUBSI

సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, – విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.