1 కొరింథీయులకు 15:50-58
1 కొరింథీయులకు 15:50-58 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్యంలో పాలుపొందలేవు, నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. నేను మీకు చెప్పే ఈ రహస్యాన్ని వినండి: మనమందరం నిద్రించము గాని, మనమందరం మార్పు చెందుతాము. ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం యదార్థమవుతుంది. “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు. కనుక నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ నిష్ప్రయోజనం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాలలో పూర్తి శ్రద్ధ చూపండి.
1 కొరింథీయులకు 15:50-58 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి. “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.
1 కొరింథీయులకు 15:50-58 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు. మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది: “మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.” “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ? ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?” మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రంనుండి పొందుతుంది. కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు. కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృథాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.
1 కొరింథీయులకు 15:50-58 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, – విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
1 కొరింథీయులకు 15:50-58 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందలేవు. నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము. ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది. “ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?” మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు. కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.