తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెను–దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుగాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారుచేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా? అప్పుడు పితరులయిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి మనః పూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి. తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.
రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము. మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమ కూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచు న్నాను. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును, నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. ఈలాగు పలికిన తరువాత దావీదు–ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమపితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.