1 దినవృత్తాంతములు 20

20
1మరుసటియేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను. 2దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహువిస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను. 3దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.
4అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. 5మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేతగాని దోనెయంత పెద్దది. 6మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు. 7వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. 8గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 20: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for 1 దినవృత్తాంతములు 20