మత్తయి 15

15
అపవిత్రపరిచేది ఏది
1అప్పుడు కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేము పట్టణం నుండి యేసు దగ్గరకు వచ్చి, 2“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండ భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు.
3అప్పుడు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, “మీ సంప్రదాయం కొరకు దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు? 4ఎందుకంటే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించాలి’#15:4 నిర్గమ 21:12; ద్వితీ 5:16 మరియు ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే వారికి మరణశిక్ష విధించాలి.’#15:4 నిర్గమ 21:17; లేవీ 20:9 5కానీ మీరు, ఎవరైనా తమ తండ్రికి లేదా తల్లికి సహాయపడడానికి ఉపయోగించినది ‘దేవునికి అంకితం’ అని ప్రకటిస్తే, 6వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కొరకు దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. 7వేషధారులారా! మీ గురించి యెషయా ప్రవచించింది నిజమే, అది ఏంటంటే:
8“ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు
కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి;
9వారి బోధలు కేవలం మనుష్యుల నియమాలు,
వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు.’ ”#15:9 యెషయా 29:13
10యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “మీరు విని తెలుసుకోండి. 11నోటిలోకి వెళ్లేవి ఒకరిని అపవిత్రపరచవు, కాని నోటి నుండి బయటికి వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రపరుస్తాయి” అని వారితో చెప్పారు.
12ఆ తర్వాత యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పరిసయ్యులు ఆ మాటలను విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలుసా!” అని అడిగారు.
13అందుకు యేసు, “పరలోకపు నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో సహా పీకివేయబడుతుంది. 14వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు.
15అందుకు పేతురు, “మాకు ఈ ఉపమానం అర్థమయ్యేలా చెప్పమని” అడిగాడు.
16యేసు, “మీరు ఇంకా అవివేకంగానే ఉన్నారా? 17నోటిలోకి పోయేవన్ని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడతాయని మీరు చూడలేదా? అని వారిని అడిగారు. 18కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలో నుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. 19ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధ సాక్ష్యం మరియు దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి. 20ఇవే వ్యక్తిని అపవిత్రపరుస్తాయి; అంతేకాని చేతులు కడుగకుండా భోజనం చేస్తే అది వారిని అపవిత్రపరచదు” అని చెప్పారు.
కనాను స్త్రీ విశ్వాసం
21యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు, సీదోను పట్టణ ప్రాంతాలకు వెళ్లారు. 22అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది” అని కేకలు వేసింది.
23కాని యేసు ఆమె మాటలకు సమాధానం ఇవ్వలేదు. కనుక ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈమె కేకలువేస్తూ మన వెనుకే వస్తుంది గనుక ఈమెను పంపివేయమని” ఆయనను వేడుకొన్నారు.
24అందుకు యేసు, “నేను కేవలం ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను” అని చెప్పారు.
25ఆ స్త్రీ వచ్చి ఆయన ముందు మోకరించి, “ప్రభువా, నాకు సహాయం చేయమని” అడిగింది.
26అందుకు యేసు, “పిల్లల రొట్టెలను తీసికొని, కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు.
27అప్పుడు ఆమె, “నిజమే ప్రభువా, కానీ కుక్కలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా!” అని చెప్పింది.
28అందుకు యేసు, “అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!” అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.
యేసు నాలుగు వేలమందికి భోజనం పెట్టుట
29యేసు అక్కడి నుండి వెళ్లి, గలిలయ సముద్రతీరాన వెళ్తూ ఒక కొండ ఎక్కి అక్కడ కూర్చున్నారు. 30చాలా మంది ప్రజలు గుంపులుగా కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను, మూగవారిని ఇంకా అనేకమందిని ఆయన దగ్గరకు తీసికొని వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. యేసు వారిని స్వస్థపరిచారు. 31మూగవారు మాట్లాడడం, వికలాంగులు బాగుపడడం, కుంటివారు నడవడం, గ్రుడ్డివారు చూడడం వంటివి చూసి ప్రజలు ఎంతో ఆశ్చర్యపడి, ఇశ్రాయేలు దేవుని ఘనపరిచారు.
32అప్పుడు యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు, వారి మీద నాకు జాలి కలుగుతుంది. వీరిని ఆకలితో పంపడం నాకు ఇష్టం లేదు, లేదా వారు దారిలో సొమ్మసిల్లిపోతారు” అని చెప్పారు.
33అందుకు ఆయన శిష్యులు, “ఇంత మంది ప్రజలకు భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ నుండి దొరుకుతుంది?” అన్నారు.
34అందుకు యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు.
వారు, “ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని జవాబిచ్చారు.
35అప్పుడు యేసు జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించి, 36ఆ ఏడు రొట్టెలను చేపలను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చారు, వారు ప్రజలందరికి పంచిపెట్టారు. 37వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు. 38స్త్రీలు మరియు పిల్లలు కాకుండా నాలుగు వేలమంది పురుషులు తిన్నారు. 39తర్వాత ఆయన ప్రజలందరిని పంపివేసి, పడవ ఎక్కి మగదాను ప్రాంతానికి వెళ్లారు.

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

మత్తయి 15: TCV

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்