Chapa ya Youversion
Ikoni ya Utafutaji

ఆది 15

15
యెహోవా అబ్రాముతో చేసిన నిబంధన
1ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి:
“అబ్రామూ, భయపడకు,
నేను నీకు డాలును,#15:1 లేదా ప్రభువును
నీ గొప్ప బహుమానాన్ని.#15:1 లేదా నీకు గొప్ప బహుమానం కలుగుతుంది
2అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, నాకు సంతానం లేదు కదా మీరు నాకేమిచ్చినా ఏం లాభం? నా ఆస్తికి వారసుడు దమస్కువాడైన ఎలీయెజెరే కదా” అని అన్నాడు. 3ఇంకా అబ్రాము దేవునితో, “మీరు నాకు సంతానం ఇవ్వలేదు, కాబట్టి నా ఇంటి పనివారిలో ఒకడు నా వారసుడవుతాడు” అని అన్నాడు.
4అప్పుడు యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చింది: “ఈ మనుష్యుడు నీకు వారసుడు కాడు, కాని నీ రక్తమాంసాలను పంచుకుని పుట్టేవాడే నీకు వారసుడు.” 5దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు.
6అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచారు.
7అంతేకాక దేవుడు అతనితో, “ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ఊరు నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పారు.
8అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, దీనిని నేను స్వాస్థ్యంగా పొందుతానని నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు.
9అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.
10అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు. 11ఆ కళేబరాలపై వాలడానికి రాబందులు వచ్చాయి అయితే అబ్రాము వాటిని వెళ్లగొట్టాడు.
12సూర్యాస్తమయం అవుతుండగా అబ్రాముకు గాఢనిద్ర పట్టింది, భయంకరమైన కారుచీకటి అతని మీదుగా కమ్ముకుంది. 13అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు. 14అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు. 15నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు. 16నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.”
17సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి. 18ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు#15:18 లేదా నది నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే, 19కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు, 20హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు, 21అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఉన్న దేశమంతటిని ఇస్తున్నాను” అని అన్నారు.

Iliyochaguliwa sasa

ఆది 15: TSA

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia