మత్తయి 4

4
యేసు అరణ్యంలో పరీక్షించబడుట
1అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డారు. 2నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత, ఆయనకు ఆకలివేసింది. 3శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు.
4అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’#4:4 ద్వితీ 8:3 అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
5అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకొనివెళ్ళి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, 6“నీవు దేవుని కుమారుడవైతే, క్రిందికి దూకు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు,
నీ పాదాలకు ఒక రాయి కూడా తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొంటారు,’#4:6 కీర్తన 91:11,12
అని అన్నాడు.
7అందుకు యేసు వానితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’#4:7 ద్వితీ 6:16 అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
8మరల, అపవాది ఆయనను చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకువెళ్లి ప్రపంచంలోని రాజ్యాలన్నిటిని వైభవాన్ని ఆయనకు చూపించాడు. 9వాడు యేసుతో, “నీవు నా ముందు తలవంచి నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు.
10అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! ఎందుకంటే, నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది”#4:10 ద్వితీ 6:13 అని చెప్పారు.
11అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు, దూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
ప్రసంగించడం మొదలుపెట్టిన యేసు
12యోహాను చెరసాలలో వేయబడ్డాడని వినిన తర్వాత యేసు గలిలయకు వెళ్లారు. 13ఆయన నజరేతును వదలి, జెబూలూను, నఫ్తాలి ప్రాంతపు సముద్రతీరాన ఉన్న కపెర్నహూముకు వెళ్లి అక్కడ నివసించారు. 14ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరడానికి ఇలా జరిగింది:
15“జెబూలూను ప్రాంతమా, నఫ్తాలి ప్రాంతమా,
యోర్దానుకు అవతలనున్న సముద్ర మార్గమా,
యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతమా,
16చీకటిలో నివసిస్తున్న ప్రజలు,
గొప్ప వెలుగును చూసారు;
మరణచ్ఛాయలో జీవిస్తున్నవారిపై
వెలుగు ఉదయించింది.”#4:16 యెషయా 9:1,2
17అప్పటి నుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది, కనుక పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.
యేసు తన మొదటి శిష్యులను పిలుచుట
18యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులను ఆయన చూసారు. వారు జాలరులు గనుక, వారు సముద్రంలో వలలు వేస్తున్నారు. 19యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. 20వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
21ఆయన అక్కడి నుండి వెళ్తూ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరో ఇద్దరు సోదరులను చూసారు. వారు తమ తండ్రి జెబెదయితో కలసి పడవలో ఉండి తమ వలలను సిద్ధం చేసుకుంటున్నారు. యేసు వారిని పిలిచారు. 22వెంటనే వారు పడవను మరియు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
రోగులను స్వస్థపరచిన యేసు
23యేసు గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాలలో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రజల మధ్యలో ప్రతి వ్యాధిని రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు. 24ఆయన గురించి సిరియా దేశం అంతటా తెలిసి ప్రజలు రకరకాల వ్యాధులతో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛ రోగం గలవారిని మరియు పక్షవాత రోగులను యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు, ఆయన వారిని బాగుచేశారు. 25గలిలయ, దెకపొలి,#4:25 దెకపొలి అనగా పది పట్టణాలు యెరూషలేము, యూదయ, యోర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతాల నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు.

Märk

Dela

Kopiera

None

Vill du ha dina höjdpunkter sparade på alla dina enheter? Registrera dig eller logga in