యోహాను 17

17
1యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను–తండ్రీ, నా గడియ వచ్చియున్నది. 2నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. 3అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 4చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. 5తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము. 6లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. 7నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక 8నీవు నాకు అనుగ్ర హించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు. 9నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను. 10నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను. 11నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 12నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. 13ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. 14వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. 15నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి#17:15 లేక, కీడునుండి. వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను. 16నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. 17సత్యమందు#17:17 మూలభాషలోసత్యమువలన. వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. 18నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. 19వారును సత్యమందు#17:19 మూలభాషలోసత్యమువలన. ప్రతిష్ఠచేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను. 20-21మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. 22మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. 24తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి. 25నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. 26నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.

Märk

Dela

Kopiera

None

Vill du ha dina höjdpunkter sparade på alla dina enheter? Registrera dig eller logga in