అపొస్తలుల కార్యములు 3

3
1పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా, 2పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. 3పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా 4పేతురును యోహానును వానిని తేరి చూచి–మాతట్టు చూడుమనిరి. 5వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. 6అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి 7వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. 8వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను. 9వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి 10శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
11వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. 12పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను–ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? 13అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. 14మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి. 15మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు#3:15 లేక, ఆయనకు. మేము సాక్షులము. 16ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను. 17సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. 18అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. 19ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును 20మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి. 21అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము. 22మోషే యిట్లనెను–ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.#3:22 లేక, విందురు. 23ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. 24మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి. 25ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో –నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీపితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై#3:25 మూలభాషలోకుమారులై. యున్నారు. 26దేవుడు తన సేవకుని పుట్టించి,#3:26 లేక, లేపి. మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

Märk

Dela

Kopiera

None

Vill du ha dina höjdpunkter sparade på alla dina enheter? Registrera dig eller logga in

Video för అపొస్తలుల కార్యములు 3