మత్తయి 25
25
పదిమంది కన్యల ఉపమానం
1“పరలోక రాజ్యం తమ దీపాలను పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కోడానికి బయలుదేరిన పదిమంది కన్యలను పోలి ఉంది. 2వీరిలో ఐదుగురు బుద్ధిలేని వారు, ఐదుగురు బుద్ధిగలవారు. 3బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకొన్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు. 4బుద్ధిగలవారు, తమ దీపాలతో పాటు సీసాల్లో నూనె తీసుకువెళ్లారు. 5పెండ్లికుమారుడు రావడానికి ఆలస్యం అయ్యింది, అంతలో వారందరు కునికి నిద్రపోయారు.
6“అర్ధరాత్రి వేళలో, ‘ఇదిగో, పెండ్లికుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోడానికి రండి!’ అనే కేక వినబడింది.
7“అప్పుడు ఆ కన్యలందరు లేచి తమ దీపాలను సరిచేసికొని వెలిగించుకున్నారు. 8గాని బుద్ధిలేని కన్యలు బుద్ధిగల కన్యలతో, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి; మాకు కొంచెం నూనెను ఇవ్వండి’ అని అడిగారు.
9“అందుకు బుద్ధిగల కన్యలు, ‘లేదు, మాకు మీకు అది సరిపోదు, మీరు అమ్మేవారి దగ్గరకు పోయి కొనుక్కొండి’ అని చెప్పారు.
10“వారు కొనడానికి వెళ్తున్నప్పుడే, పెండ్లికుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్న కన్యలు ఆయనతో కూడ పెండ్లివిందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తలుపు మూయబడింది.
11“ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మా కొరకు తలుపు తెరవండి!’ అన్నారు.
12“కాని అతడు, ‘నేను మీతో నిజం చెప్తున్నా, మీరు ఎవరో నాకు తెలియదు’ అని జవాబిచ్చాడు.
13“కాబట్టి మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ దినము కాని ఆ గంట కాని మీకు తెలియదు” అని చెప్పారు.
తలాంతుల ఉపమానం
14యేసు మరొక ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, దూర దేశానికి ప్రయాణమై, తన ఇంట్లో పని చేసి సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఒక మనుష్యుని పోలి ఉంది. 15ఆయన వారిలో ఒకనికి ఐదు తలాంతుల బంగారం, ఇంకొకనికి రెండు తలాంతుల బంగారం, మరొకనికి ఒక తలాంతు బంగారం, ఎవని సామర్థ్యాన్ని బట్టి వానికి ఇచ్చాడు. తర్వాత అతడు ప్రయాణమై వెళ్లాడు. 16ఐదు తలాంతుల బంగారం#25:16 ఐదు తలాంతుల బంగారం ఒక తలాంతు 6,000 దీనార్లతో సమానం. ఒక దీనార్ అనగా ఒక రోజు కూలి తీసికొనిన వాడు వెంటనే వెళ్లి వెంటనే ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా ఐదు తలాంతులను సంపాదించాడు. 17అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. 18అయితే ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు మాత్రం వెళ్లి, భూమిలో ఒక గుంట త్రవ్వి దానిలో తన యజమానుని ఇచ్చిన ఒక్క తలాంతును దాచిపెట్టాడు.
19“చాలాకాలం తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. 20ఐదు తలాంతుల బంగారం తీసికొన్నవాడు ఇంకా ఐదు తలాంతులు తెచ్చి, ‘యజమానుడా, నీవు నాకు ఐదు తలాంతుల బంగారం అప్పగించావు. చూడు, నేను ఇంకా ఐదు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
21“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కనుక నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
22“అలాగే రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు కూడా వచ్చాడు. అతడు ‘యజమానుడా, నీవు నాకు రెండు తలాంతుల బంగారం అప్పగించావు; చూడు, నేను ఇంకా రెండు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
23“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కనుక నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
24“ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకొనే వాడవని నాకు తెలుసు. 25కనుక నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు.
26“అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకొనే వాడనని నీకు తెలుసు కదా? 27అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డితో కలిపి తీసుకొనేవాడిని’ అన్నాడు.
28“ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకొని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. 29ఎందుకంటే కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగివుంటాడు. లేనివారి నుండి, వారు కలిగివున్నది కూడా తీసివేయబడుతుంది. 30అయితే పనికిమాలిన ఈ దాసుని బయటకు చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
దేవుని న్యాయం గొర్రెలు మరియు మేకలను వేరుపరుస్తుంది
31మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. 32భూప్రజలందరు ఆయన ముందు పోగు చేయబడి ఉంటారు, ఒక గొర్రెల కాపరి మేకల నుండి గొర్రెలను వేరుచేసినట్లు ఆయన వారిని వేరుచేస్తాడు. 33ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను వేరుగా నిలబెడతాడు.
34అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కొరకు సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. 35ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు. 36నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు.
37“అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము? 38ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము? 39ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు.
40“అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైన వారికి చేశారు గనుక, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
41“అప్పుడు ఆయన తన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది మరియు వాని దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి. 42ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చలేదు, 43నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకోలేదు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగిగా మరియు చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు’ అని చెప్తాడు.
44“అందుకు వారు, ‘ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలితో ఉండడం లేక దాహంతో ఉండడం లేక పరదేశిగా ఉండడం లేక బట్టలు లేనివానిగా ఉండడం లేక రోగిగా లేక చెరసాలలో ఉండడం చూసి సహాయం చేయలేదు?’ అడుగుతారు.
45“అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైన వారికి చేయలేదు కనుక నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
46“అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”
Trenutno izabrano:
మత్తయి 25: TCV
Istaknuto
Podijeli
Kopiraj
Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.