ఆదికాండము 28
28
1ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు వివాహం చేసుకోగూడదు. 2కనుక ఈ చోటు విడిచి, పద్దనరాము వెళ్లు. నీ తల్లిరి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు. 3సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన. 4దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లే నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం.”
5ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించాడు. రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్లాడు. లాబాను, రిబ్కాలకు తండ్రి బెతూయేలు. యాకోబు, ఏశావులకు తల్లి రిబ్కా.
6తన తండ్రియైన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు భార్యను సంపాదించు కొనేందుకు ఇస్సాకు అతణ్ణి పద్దనరాముకు పంపినట్లు ఏశావుకు తెలిసింది. యాకోబు కనాను స్త్రీని వివాహము చేసుకోగూడదని ఇస్సాకు ఆజ్ఞాపించినట్లు ఏశావుకు తెలిసింది. 7యాకోబు తన తల్లిదండ్రుల మాటకు విధేయుడై పద్దనరాము వెళ్లినట్లు ఏశావుకు తెలిసింది.
8తన కుమారులు కనానీ స్త్రీలను వివాహం చేసుకోవటం తండ్రికి ఇష్టం లేదని దీనిద్వారా ఏశావుకు తెలిసింది. 9అప్పటికే ఏశావుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, మరో స్త్రీని పెళ్లి చేసికొన్నాడు. ఇష్మాయేలు కుమార్తె మాహలతును అతను పెళ్లి చేసుకొన్నాడు. ఇష్మాయేలు అబ్రాహాము కుమారుడు. మాహలతు నెబాయోతు సోదరి.
బేతేలులో యాకోబు కలగనుట
10యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. 11యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటికి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. 12యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్లు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్లు యాకోబు చూశాడు.
13అప్పుడు ఆ నిచ్చెన పైన యెహోవా నిలిచినట్లు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి. ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 14నేలమీద ధూళి కణముల్లాగ నీకు కూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.
15“నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసింది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”
16అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్లు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.
17యాకోబు భయపడి, “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.
18ఉదయం పెందలాడే యాకోబు లేచి, తాను పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోశాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేశాడు. 19ఆ స్థలం పేరు లూజు. అయితే యాకోబు దానికి బేతేలు#28:19 బేతేలు “దేవుని గృహం.” అని పేరు పెట్టాడు.
20అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేశాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుతూ ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే, 21నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు. 22నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.
Trenutno izabrano:
ఆదికాండము 28: TERV
Istaknuto
Podijeli
Kopiraj

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International