Logoja YouVersion
Ikona e kërkimit

లూకా 20

20
1ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి 2–నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. 3అందుకాయన– నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. 4యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా 5వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల–ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. 6మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని 7– అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. 8అందుకు యేసు–ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితోననెను.
9అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను – ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను. 10పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి. 11మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి. 12మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి. 13అప్పుడా ద్రాక్షతోట యజమానుడు–నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెదరను కొనెను. 14అయినను ఆ కాపులు అతనిని చూచి–ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని 15అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? 16అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని– అట్లు కాకపోవును గాకనిరి. 17ఆయన వారిని చూచి– ఆలాగైతే
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి
మూలకు తలరాయి ఆయెను
అని వ్రాయబడిన మాట ఏమిటి? 18ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.
19ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరిగాని జనులకు భయపడిరి. 20వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి. 21వారు వచ్చి–బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీ వెవనియందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము. 22మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. 23-24ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి–ఒక దేనారము#20:23-24 దేనారము ఇంచుమించు అర్ధరూపాయి కావచ్చును. నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు– కైసరు వనిరి. 25అందుకాయన–ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. 26వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
27పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. 28–బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను. 29యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్ర్తీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను. 30రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. 31ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్ర్తీయు చనిపోయెను. 32-33కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. 34అందుకు యేసు–ఈ లోకపు జనులు#20:34 మూలభాషలో–ఈ యుగపు కుమారులు. పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని 35పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు. 36వారు పునరుత్థానములో పాలివారైయుండి,#20:36 మూలభాషలో–పునరుత్థానపు కుమారులై యుండి. దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. 37-38పొదనుగురించిన భాగములో –ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. 39-40తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు–బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి.
41ఆయన వారితో–క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు–
42-43నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. 44దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.
45ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు 46సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు. 47వారు విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.

Aktualisht i përzgjedhur:

లూకా 20: TELUBSI

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr