Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

లూకా సువార్త 19

19
పన్ను వసూలు చేసే జక్కయ్య
1యేసు యెరికో పట్టణంలోనికి ప్రవేశించి దానిగుండా వెళ్తున్నారు. 2అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు. 3అతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు, కాని అతడు పొట్టివాడు కాబట్టి జనసమూహం మధ్యలో ఉన్న యేసును చూడలేకపోయాడు. 4కాబట్టి యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు పరుగెత్తి యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు.
5యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఆయన పైకి చూసి అతనితో, “జక్కయ్యా, వెంటనే క్రిందికి దిగు. నేను ఈ రోజు నీ ఇంట్లో ఉండాలి” అన్నారు. 6అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
7ప్రజలందరు అది చూసి, “ఈయన ఒక పాపాత్ముని ఇంటికి అతిథిగా వెళ్లాడు” అని సణగడం మొదలుపెట్టారు.
8కానీ జక్కయ్య నిలబడి ప్రభువుతో, “చూడు, ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను, నేనెవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే, వారికి నాలుగంతలు నేను చెల్లిస్తాను” అని చెప్పాడు.
9అందుకు యేసు అతనితో, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, కాబట్టి నేడు రక్షణ ఈ ఇంటికి వచ్చింది. 10ఎందుకంటే మనుష్యకుమారుడు వచ్చిందే తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి.”
పది వెండి నాణెముల ఉపమానం
11వారు ఈ మాటలు వింటూ ఉండగా, యేసు తాను యెరూషలేముకు దగ్గరగా ఉన్నందుకు, ప్రజలు దేవుని రాజ్యం అకస్మాత్తుగా వచ్చేస్తుందని భావిస్తున్నందుకు, ఆయన వారికి ఒక ఉపమానం చెప్పారు 12“గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి. 13అందుకతడు తన పదిమంది సేవకులను పిలిచి వారికి పది మినాలను#19:13 మినా అంటే సుమారు మూడు నెలల జీతం ఇచ్చి, ‘నేను తిరిగి వచ్చేవరకు, వీటితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.
14“కాని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు కాబట్టి, ‘ఇతడు మాకు రాజుగా వద్దు’ అనే సందేశాన్ని అతనికి పంపించారు.
15“ఎలాగైతేనేం, అతడు రాజ్యాన్ని స్వాధీనపరచుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. తర్వాత అతడు తాను డబ్బు ఇచ్చిన సేవకులు దానితో ఏమి లాభం పొందారో తెలుసుకోవడానికి వారిని పిలిపించాడు.
16“మొదటివాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా పది మినాలను సంపాదించింది’ అని చెప్పాడు.
17“ఆ యజమాని, ‘భళా, మంచి దాసుడా! నీవు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, కాబట్టి పది పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను’ అని వానితో చెప్పాడు.
18“తర్వాత రెండవవాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా అయిదు మినాలు సంపాదించింది’ అని చెప్పాడు.
19“అతని యజమాని అతనితో, ‘నిన్ను అయిదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు.
20-21“అప్పుడు మరొకడు వచ్చి, ‘అయ్యా, నీవు పెట్టని చోట తీసుకునే, విత్తని చోట పంటను కోసే కఠినుడవని భయపడి, ఇదిగో నీవు ఇచ్చిన ఈ మినాను రుమాలులో దాచి పెట్టాను’ అన్నాడు.
22“అందుకు ఆ యజమాని, ‘చెడ్డ దాసుడా, నీ నోటి మాటతోనే నీకు తీర్పు తీరుస్తాను! నేను పెట్టని చోట తీసుకొనేవాడినని, విత్తని చోట పంటను కోసేవాడినని, కఠినుడనని నీకు తెలుసు, అవునా? 23అలాంటప్పుడు నీవు నా సొమ్మును, నేను తిరిగివచ్చిన తర్వాత, వడ్డీతో సహా తీసుకునేలా, వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు?’ అన్నాడు.
24“ఆ తర్వాత ఆ యజమాని తన దగ్గర నిలిచిన వారితో, ‘వీని నుండి ఆ మినా తీసుకుని ఇప్పటికే పది మినాలు గలవానికి ఇవ్వండి’ అని చెప్పాడు.
25“వారు, ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు.
26“అందుకు ఆ యజమాని, ‘కలిగిన ప్రతివానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని మీతో చెప్తున్నాను’ అన్నాడు. 27అతడు ఇంకా ఏమి చెప్పాడంటే, ‘అయితే నేను పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడకు తెచ్చి నా ముందు వారిని సంహరించండి’ అన్నాడు.”
యేసు రాజుగా యెరూషలేముకు వచ్చుట
28యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేముకు ప్రయాణమై వెళ్లారు. 29ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియ గ్రామాల సమీపంలో ఉన్నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, 30“మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో మీరు ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడకు తీసుకురండి. 31‘మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి.”
32ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు 33వారు ఆ గాడిద పిల్లను విప్పుతుంటే, దాని యజమానులు, “మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
34అందుకు వారు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు.
35వారు దానిని యేసు దగ్గరకు తీసుకువచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ వస్త్రాలను వేశారు, యేసు దానిపై కూర్చున్నారు. 36ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు.
37ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్భుతాలన్నిటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:
38“ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక!”#19:38 కీర్తన 118:26
“ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!”
అని దేవుని స్తుతించారు.
39ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసుతో, “బోధకుడా, నీ శిష్యులను గద్దించు!” అన్నారు.
40ఆయన వారితో, “నేను చెప్తున్నాను, వీరు ఊరుకుంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు.
41ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూసి దాని గురించి ఏడుస్తూ, 42“నీకు దేని ద్వార సమాధానం కలుగుతుందో నీవు తెలుసుకొని ఉంటే బాగుండేది, కాని ఇప్పుడది నీ కళ్ల నుండి దాచబడి ఉంది. 43-44ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కాబట్టి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు.
యెరూషలేము దేవాలయంలో యేసు
45యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, అక్కడ అమ్ముకునే వారిని తరమడం ప్రారంభించారు. 46“ ‘నా మందిరం ప్రార్థన మందిరం’#19:46 యెషయా 56:7 అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దానిని ‘దొంగల గుహగా’#19:46 యిర్మీయా 7:11 చేశారు” అని అన్నారు.
47ఆయన ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తూ ఉండేవారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రజానాయకులు ఆయనను చంపాలని ప్రయత్నించారు. 48అయినా ప్రజలందరు ఆయన చెప్పే మాటలను వినాలని ఆయననే హత్తుకుని ఉన్నారు, కాబట్టి వారేమి చేయలేకపోయారు.

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda