Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

లూకా సువార్త 17

17
పాపం, విశ్వాసం, బాధ్యత
1యేసు తన శిష్యులతో, “ప్రజలను ఆటంకపరిచే శోధనలు తప్పకుండా వస్తాయి, కాని అవి ఎవరి వలన వస్తాయో, వానికి శ్రమ. 2ఎవడైనా ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకంగా ఉండడం కన్నా, వాని మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వానికి మేలు. 3కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
“ఒకవేళ నీ సహోదరుడు గాని సహోదరి గాని నీ ఎడల పాపం చేస్తే, వారిని గద్దించండి; వారు పశ్చాత్తాపపడితే, వారిని క్షమించండి. 4వారు ఒకే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసి తాము చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అంటూ నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి.”
5అప్పుడు అపొస్తలులు, “ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచండి!” అని అడిగారు.
6అందుకు ఆయన, “మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో నాటబడు’ అని చెప్తే అది మీకు లోబడుతుంది.
7“మీలో ఎవనికైనా దున్నడానికి లేదా మేపడానికి సేవకుడు ఉన్నాడనుకోండి. వాడు పొలంలో పని చేసి ఇంటికి రాగానే, అతని యజమాని, ఆ సేవకునితో, ‘భోజనం చేద్దాం రా అని వానిని పిలుస్తాడా?’ 8దాని బదులు, ‘ముందుగా నాకు భోజనం సిద్ధం చేసి, నీవు సిద్ధపడి నేను తిని త్రాగే వరకు నా సేవ చేయి, ఆ తర్వాత నీవు తిని త్రాగవచ్చు’ అని చెప్పుతాడు కదా! 9తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా? 10అలాగే మీరు కూడా, మీకు అప్పగించబడిన పనులన్నీ చేసిన తర్వాత, ‘మేము యోగ్యత లేని సేవకులం; మా పని మాత్రమే మేము చేశాం’ అని చెప్పాలి” అని అన్నారు.
పదిమంది కుష్ఠురోగులను శుద్ధులుగా చేసిన యేసు
11యేసు సమరయ గలిలయ ప్రాంతాల సరిహద్దుల గుండా యెరూషలేముకు వెళ్లారు. 12ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించేటప్పుడు పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరంగా నిలబడి, 13“యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు.
14ఆయన వారిని చూసి, వారితో, “మీరు వెళ్లి, మిమ్మల్ని మీరు యాజకులకు కనుపరచుకోండి” అన్నారు. వారు వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు.
15అందులో ఒకడు, తనకు స్వస్థత కలిగిందని చూసుకొని, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చాడు. 16అతడు యేసు పాదాల ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయుడు.
17యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? 18ఈ సమరయుడు తప్ప దేవుని స్తుతించడానికి ఇంకెవరు తిరిగి రాలేదా?” అని అడిగారు. 19ఆ తర్వాత వానితో, “నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు.
రాబోయే దేవుని రాజ్యం
20ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని యేసును అడిగినప్పుడు ఆయన, “దేవుని రాజ్యం పైకి కనిపించేదిగా రాదు, 21దేవుని రాజ్యం మీలోనే ఉంది కాబట్టి ‘ఇదిగో ఇక్కడ ఉంది’ లేదా ‘అదిగో అక్కడ ఉంది’ అని ఎవరు చెప్పలేరు” అని జవాబిచ్చారు.
22ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనుష్యకుమారుని దినాల్లోని ఒక రోజునైనా చూడాలని మీరు ఆశించే సమయం వస్తుంది, కాని మీరు ఆ రోజును చూడరు. 23ప్రజలు మీతో ‘అదిగో ఆయన అక్కడ ఉన్నాడు!’ లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు!’ అని అంటారు. మీరు వారి వెనుక పరుగెత్తకండి. 24ఎందుకంటే మనుష్యకుమారుని రాకడ దినం ఆకాశంలో ఒక దిక్కునుండి మరో దిక్కువరకు మెరిసే మెరుపువలె ఉంటుంది. 25కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి.
26“నోవహు దినాల్లో జరిగినట్టు, మనుష్యకుమారుని దినాల్లో కూడా జరుగుతుంది. 27నోవహు ఓడలోనికి ప్రవేశించిన రోజు వరకు ప్రజలందరూ తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసింది.
28“లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు. 29కానీ లోతు సొదొమ గ్రామం విడిచి వెళ్లిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి వారందరు నాశనం అయ్యారు.
30“మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది. 31ఆ రోజు ఇంటిపైన ఉన్నవారెవరు ఇంట్లోనుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు. 32లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దాన్ని పోగొట్టుకుంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవారు దాన్ని కాపాడుకుంటారు. 34ఆ రాత్రి ఒకే పరుపు మీద ఉన్న ఇద్దరిలో, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు. 35ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలి విసురుతుంటారు; ఒక స్త్రీ కొనిపోబడుతుంది, ఇంకొక స్త్రీ విడవబడుతుంది. 36ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు; ఒకడు కొనిపోబడతాడు మరొకడు విడవబడుతాడు” అని చెప్పారు.#17:36 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
37అందుకు శిష్యులు, “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని యేసును అడిగారు.
అందుకు యేసు, “పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి” అని వారికి జవాబిచ్చారు.

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda