Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

యోహాను సువార్త 18

18
యేసు అప్పగించబడుట
1యేసు ప్రార్థించిన తర్వాత తన శిష్యులతో కలిసి కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోకి వెళ్లారు.
2యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కాబట్టి ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు. 3కాబట్టి యూదా తనతో సైనికుల గుంపును ముఖ్య యాజకులు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో తోటకు వచ్చాడు.
4యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
5“నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు.
“ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు. 6యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు.
7ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
అందుకు, “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు.
8అందుకు యేసు, “నేనే ఆయనను. ఒకవేళ మీరు నా కోసం వెదకుతున్నట్లయితే వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు. 9“నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు”#18:9 యోహాను 6:39 అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది.
10అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు.
11అప్పుడు యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు.
12అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు. 13వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకెళ్లారు. 14ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే.
మొదటిసారి పేతురు నిరాకరించుట
15సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కాబట్టి, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు. 16కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునితో పరిచయం ఉన్న ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువచ్చాడు.
17ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కదా?” అని పేతురును అడిగింది.
అందుకు అతడు, “కాదు” అన్నాడు.
18అప్పుడు చలిగా ఉండడంతో సేవకులు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు.
ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించుట
19ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు.
20అందుకు యేసు, “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను. ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరాల్లో దేవాలయాల్లోనే నేను బోధించాను. నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు. 21నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు.
22యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడి ఉన్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంపమీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు.
23అందుకు యేసు, “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు. 24అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు.
రెండవసారి మూడవసారి పేతురు నిరాకరించుట
25సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు వారు, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు.
అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు.
26ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువైన ఒకడు, “నేను నిన్ను ఒలీవల తోటలో అతనితో చూడలేదా?” అని అడిగాడు. 27పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.
పిలాతు ఎదుటకు యేసు
28అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గర నుండి రోమా అధిపతి భవనానికి తీసుకెళ్లారు. అప్పటికి తెల్లవారింది కాబట్టి అపవిత్రపడకుండ పస్కాను తినాలని వారు భవనం లోనికి వెళ్లలేదు. 29కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఇతని మీద ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు.
30వారు, “ఇతడు నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు.
31పిలాతు, “అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు.
అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు. 32యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
33తర్వాత పిలాతు భవనం లోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34యేసు, “అది నీ సొంత ఆలోచనా లేదా ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు.
35పిలాతు, “నేనేమైనా యూదుడనా? నీ సొంత ప్రజలు ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేశావు?” అని అడిగాడు.
36యేసు, “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండి ఉంటే, యూదా నాయకులు నన్ను బంధించకుండా నా సేవకులు వారితో పోరాడి ఉండేవారు. కాని నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చారు.
37అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు.
అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు.
38పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, “ఇతన్ని నిందించడానికి తగిన నేరం ఏదీ నాకు కనిపించలేదు. 39కాని పస్కా పండుగ సమయంలో నేరస్థులలో ఒకరిని నేను మీ కోసం విడుదల చేసే ఆచారం ఉంది కాబట్టి, యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వారిని అడిగాడు.
40అందుకు వారు, “వద్దు, ఆయన వద్దు! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని గట్టిగా కేకలు వేశారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda