Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

ఆది 11

11
బాబెలు గోపురం
1భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది. 2ప్రజలు తూర్పు#11:2 లేదా తూర్పు నుండి; లేదా తూర్పులో వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు.
3వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు. 4అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.
5అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు. 6యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు. 7రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు.
8కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు. 9యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు#11:9 బాబెలు హెబ్రీ భాషలో తారుమారు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.
షేము నుండి అబ్రాము వరకు
10ఇది షేము కుటుంబ వంశావళి.
జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు. 11అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
12అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు. 13షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు.
14షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు. 15ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
16ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు. 17పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
18పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు. 19రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
20రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు. 21సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
22సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు. 23నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.
24నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు. 25తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
26తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
అబ్రాము కుటుంబం
27ఇది తెరహు కుటుంబ వంశావళి.
తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు. 28హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు. 29అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె. 30శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు.
31తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
32తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు.

Zvasarudzwa nguva ino

ఆది 11: TSA

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda