ఆదికాండము 4
4
ప్రథమ కుటుంబం
1ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను#4:1 కయీను “తయారు చేయు” లేక “పొందు” అనే అర్థం వచ్చే హీబ్రూ పదంవంటిది. అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.
2ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.
ప్రథమ హత్య
3-4కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు.
హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. 5అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. 6యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? 7నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును#4:7 కానీ … పాపమును నీవు మంచి పని చేయకపోతే, “పాపము” సింహంలా నీ ద్వారం దగ్గర పొంచి ఉంటుంది. అది నిన్ను కోరుకుంటుంది. గాని నీవే దాని మీద అధికారం కలిగి ఉండాలి. అదుపులో పెట్టాలి.”
8“మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు.
9తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?”
అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని?” అని కయీను జవాబిచ్చాడు.
10అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర పెట్టుతూ వుంది. 11(నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. 12ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”
13అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! 14చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”
15అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా.” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేశాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది.
కయీను కుటుంబం
16అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.
17కయీను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.
18హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు.
19లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. 20ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండ్రి. 21ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు.) సితారాను, పిల్లన గ్రోవిని ఊదేవారందరికిని యూబాలు తండ్రి. 22సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, యినుము పనులు చేసే వాళ్లందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు పెట్టబడింది.
23లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు:
“ఆదా, సిల్లా, నా మాట వినండి!
లెమెకు భార్యలారా, నేను చెప్పే సంగతులను వినండి:
ఒకడు నన్ను గాయపర్చాడు కనుక నేను వాడ్ని చంపేశాను.
ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేశాను.
24కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం!
కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుంది.”
ఆదాము హవ్వలకు షేతు పుట్టుట
25ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. 26షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని అతడు పేరు పెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.
Currently Selected:
ఆదికాండము 4: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International