Logótipo YouVersion
Ícone de pesquisa

మార్కు సువార్త 2

2
పక్షవాతంగల వానిని క్షమించి బాగుచేసిన యేసు
1కొన్ని రోజుల తర్వాత, యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చారని ప్రజలకు తెలిసింది. 2వారు పెద్ద సంఖ్యలో కూడి వచ్చారు కాబట్టి తలుపు బయట నిలబడడానికి కూడ స్థలం లేదు, అయినా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. 3అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు, నలుగురు అతన్ని మోసుకొచ్చారు. 4కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకుని వెళ్లలేదా, సరిగ్గా యేసు ఉన్నచోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి క్రిందికి దింపారు. 5యేసు వారి విశ్వాసం చూసి, పక్షవాతం గలవానితో, “కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు.
6-7కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు, వారు తమలో తాము, “ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతడు దైవదూషణ చేస్తున్నాడు! దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచిస్తున్నారు.
8వారు తమ హృదయాల్లో ఆలోచిస్తున్నది ఇదే అని వెంటనే యేసు తన ఆత్మలో గ్రహించి వారితో, “మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9ఏది సులభం: ఈ పక్షవాతం గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడమా లేదా, ‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు’ అని చెప్పడమా? 10అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, 11“నేను చెప్తున్న. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. 12అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరు చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు.
యేసు లేవీని పిలువడం యేసు పాపులతో కలిసి భోజనం చేయడం
13యేసు మరొకసారి సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ ఒక గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. 14ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవీని చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు, లేవీ లేచి ఆయనను వెంబడించాడు.
15లేవీ ఇంట్లో యేసు భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనను వెంబడించేవారు చాలామంది అక్కడ ఉన్నారు. 16పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు అతన్ని పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి తినడం చూసి, “ఆయన పన్ను వసూలు చేసేవారితో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.
17అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.
ఉపవాసం గురించి ప్రశ్నించిన యేసు
18యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు. కొందరు వచ్చి, “యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు కాని, నీ శిష్యులు ఉండడం లేదు ఎందుకు?” అని యేసును అడిగారు.
19అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు ఉపవాసం ఉంటారు? అతడు తమతో కూడ ఉన్నంత వరకు, వారు ఉపవాసం ఉండరు. 20అయితే పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, ఆ రోజున వారు ఉపవాసం ఉంటారు.
21“ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, అలా చేస్తే, క్రొత్త బట్టముక్క పాత బట్ట నుండి పిగిలిపోతూ చినుగును మరి ఎక్కువ చేస్తుంది. 22ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్షరసం, తిత్తులు రెండూ పాడైపోతాయి. అందుకే, వారు క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోస్తారు” అని చెప్పారు.
యేసు సబ్బాతుకు ప్రభువు
23ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయనతో పాటు నడుస్తున్న శిష్యులు, కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు. 24అది చూసిన పరిసయ్యులు, “చూడు, ఎందుకు వారు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని ఆయనతో అన్నారు.
25అందుకు ఆయన, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? 26ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినాల్లో, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తిని, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.
27ఆయన వారితో, “మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు. 28కాబట్టి మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి కూడ ప్రభువు” అని చెప్పారు.

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão