YouVersion Logo
Search Icon

జెకర్యా 9

9
ఇశ్రాయేలు శత్రువులపై తీర్పు
1ప్రవచనం:
హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి
వచ్చిన యెహోవా వాక్కు:
మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు
యెహోవా మీద ఉన్నాయి.
2అంతేకాక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గురించి,
చాలా నిపుణులైన తూరు సీదోను ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు.
3తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది;
ధూళి అంత విస్తారంగా వెండిని,
వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది.
4అయితే యెహోవా దాని సంపదలు తీసివేసి,
సముద్రంలో ఉన్న దాని శక్తిని నాశనం చేస్తారు.
అది అగ్నితో కాల్చబడుతుంది.
5అష్కెలోను దానిని చూసి భయపడుతుంది;
గాజా వేదనతో విలపిస్తుంది
ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది.
గాజా తన రాజును కోల్పోతుంది
అష్కెలోను ఎడారిగా మారుతుంది.
6సంకరజాతి ప్రజలు అష్డోదును ఆక్రమిస్తారు,
ఫిలిష్తీయుల గర్వాన్ని నేను అంతం చేస్తాను.
7వారి నోటిలో నుండి రక్తాన్ని,
వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను.
వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై
యూదాలో ఒక వంశంగా ఉంటారు.
ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు.
8నేను కళ్లారా చూస్తున్నాను కాబట్టి
బాధించేవారు నా ప్రజలపై మరలా ఎన్నడూ దాడి చేయకుండా
దోపిడి మూకలు నా మందిరం మీదికి రాకుండా కాపాడడానికి
నేను దాని దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తాను.
సీయోను రాజు వచ్చుట
9సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు!
యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి!
ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు
దీనుడిగా గాడిద మీద,
గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ
మీ దగ్గరకు వస్తున్నాడు.
10నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను
యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను
యుద్ధపు విల్లు విరిగిపోతుంది.
ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు.
ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు
నది#9:10 అంటే, యూఫ్రటీసు నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.
11నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి
బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.
12నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి.
నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.
13నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను
ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను.
సీయోనూ, నీ కుమారులను పురికొల్పి
నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను;
గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.
యెహోవా ప్రత్యక్షమవుతారు
14అప్పుడు యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతారు;
ఆయన బాణాలు మెరుపులా వస్తాయి.
ప్రభువైన యెహోవా బాకా మోగిస్తూ
దక్షిణపు తుఫాను గాలులతో ముందుకు సాగుతారు,
15సైన్యాల యెహోవా వారిని కాపాడతారు.
వారు నాశనం చేస్తూ
వడిసెల రాళ్లతో గెలుస్తారు.
వారు త్రాగి, ద్రాక్షారసాన్ని త్రాగినట్లుగా వారు గర్జిస్తారు;
బలిపీఠం మూలల్లో చిలకరించడానికి ఉపయోగించే గిన్నెలా
వారు నిండుగా ఉంటారు.
16కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు
ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు.
వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా
ఆయన దేశంలో ఉంటారు.
17ధాన్యంతో యువకులు
క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు.
వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!

Currently Selected:

జెకర్యా 9: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in