ఆది 9

9
నోవహుతో దేవుని నిబంధన
1దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 2అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.
3ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. 4కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.
5మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. 6దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. 7మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.
8దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ, 9“వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను, 10మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.
11నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు.
12దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, 13మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.
14భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. 15అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.
16ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు. 17దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.
నోవహు, అతని కుమారులు
18ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. 19వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.
20నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు. 21ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.
22అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు. 23అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.
24అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు.
25“కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. 26అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక.
కనాను అతనికి సేవకుడవుతాడు గాక.
27దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక.
అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు.
అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు.
28ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు. 29నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.

Одоогоор Сонгогдсон:

ఆది 9: IRVTel

Тодруулга

Хуваалцах

Хувилах

None

Тодруулсан зүйлсээ бүх төхөөрөмждөө хадгалмаар байна уу? Бүртгүүлэх эсвэл нэвтэрнэ үү

ఆది 9-д зориулсан видео